Iran: ఉలిక్కి పడ్డ ఇరాన్.. అణుకేంద్రం వద్ద భూకంపం
- బుష్ హర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సమీపంలో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైన తీవ్రత
- విమానం కూలిన సమయంలోనే సంభవించిన భూకంపం
ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఈ ఉదయం ఇరాన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇరాన్ అణుకేంద్రం వద్ద ఈ ఉదయం భూకంపం సంభవించింది. బుష్ హర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కు సమీపంలో ఇది చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది.
భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టెహ్రాన్ సమీపంలో విమానం కూలిపోయిన సమయంలోనే భూకంపం కూడా సంభవించడంతో... ఏం జరుగుతోందో అర్థంకాక అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు దీనిపై అమెరికా భూభౌతిక విజ్ఞాన సంస్థ స్పందిస్తూ, ఇది ప్రకృతి సహజంగా వచ్చిన భూకంపమేనని పేర్కొంది.