Bjp: రైతులు సర్వం కోల్పోతున్నామన్న భయాందోళనల్లో ఉన్నారు: బీజేపీ ఎంపీ టీజీ
- మూడు రాజధానుల విషయం అప్పుడే చెప్పాల్సింది
- ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి కావు
- సీమ హక్కులు కోల్పోయే పరిస్థితిలో లేము
మూడు రాజధానుల విషయం ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు వుండేవి కావని, ఏదో అయిపోతుందనే భయం రైతుల్లో ఉండేది కాదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతిని తరలిస్తారన్న యోచనతో అక్కడి రైతులు సర్వం కోల్పోతున్నామనే భయాందోళనల్లో ఉన్నారని అన్నారు.
రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, అన్ని ప్రాంతాలతో సమానంగా ‘సీమ’ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసినట్టే అవుతుందని అన్నారు. రాయలసీమ హక్కులు కోల్పోయే పరిస్థితిలో ఇక్కడి వారు లేరని స్పష్టం చేశారు.
ఒకవేళ విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే కనుక అక్కడికి వెళ్లాలంటే సీమ ప్రజలు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని అన్నారు. ఇక్కడి రాజకీయ నేతలు తమ పదవులపై కాంక్ష వదులుకొని, అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం కచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, వైఎస్ హయాంలలో మిగులు జలాలతో ‘సీమ’కు కొంత న్యాయం జరిగిందని గుర్తుచేశారు. అందరూ బాగుండాలన్నదే రాయలసీమ ప్రజల ఉద్దేశమని చెప్పిన టీజీ, అమరావతిపై తమ వైఖరి ఎప్పటికీ మారదని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు.