YSRCP: ఏపీలో పింఛన్లు ఇక ఇంటి వద్దకే: సీఎం జగన్
- వచ్చే నెల నుంచి అమలు
- రాష్ట్రంలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు
- ఖాళీగా ఉన్న15,971 పోస్టుల భర్తీకి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు శుభవార్త. వచ్చే నెలనుంచి పింఛన్లను ఇక ఇంటివద్దే అందుకునే సౌలభ్యాన్ని పొందనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ఒక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నుంచి పింఛన్లను లబ్ధిదారులకు ఇంటివద్దే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పథకాలపై ఆయన అధికారులతో చర్చించారు.
అర్హులు ఎంతమంది ఉన్నా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి అర్హులను గుర్తించాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న 15,971 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పింఛను దారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి ఇంటివద్దే పింఛను మొత్తాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.