Ukraine: ఉక్రెయిన్ విమాన ప్రమాద ఘటనలో ఇరాన్ పై బలపడుతున్న అనుమానాలు
- టెహ్రాన్ ఎయిర్ పోర్టు సమీపంలో కూలిన ఉక్రెయిన్ విమానం
- పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్న ఇరాన్ ప్రభుత్వం
- బ్లాక్ బాక్స్ ఇచ్చేందుకు నిరాకరణ
ఇరాన్ గడ్డపై భారీ విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం 180 మందితో వెళుతూ టెహ్రాన్ ఎయిర్ పోర్టుకు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదం ఇంజిన్ వైఫల్యం కారణంగా జరిగిందని తొలుత పేర్కొన్న ఉక్రెయిన్ ప్రభుత్వం తాజా ప్రకటనలో 'ఇంజిన్ వైఫల్యం' అనే పదాలను తొలగించింది. కూలిపోయింది ఉక్రెయిన్ కు చెందిన విమానమైతే, బ్లాక్ బాక్స్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లను ఇచ్చేందుకు ఇరాన్ నిరాకరిస్తుండడమే అందుకు కారణం.
విమానం కూలిపోయిన వెంటనే ఇరాన్ సహాయక బృందాలు బ్లాక్ బాక్స్ ను సేకరించాయి. అంతేకాదు, విమానం నేలకూలిన తర్వాత మంటల్లో కాలి బూడిదైందని ఇరాన్ చెబుతుండగా, వీడియో ఫుటేజ్ లో మాత్రం విమానం గాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇరాన్ వైఖరి పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది.
ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతో అమీతుమీకి సిద్ధమైన ఇరాన్... మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం స్థావరాలపై దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ విమానం ఉన్నట్టుండి కూలిపోయింది. రెండు రోజుల క్రితమే విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీలు చేశామని, సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశాలు దాదాపు లేవని బోయింగ్ సంస్థ చెబుతోంది.