Amaravati: రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: జనసేన నేత నాదెండ్ల మనోహర్

  • ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే నిలదీయాలి
  • వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాలకు లొంగవద్దు
  • వైసీపీ ప్రభుత్వం తమ పరిధిలో లేని నిర్ణయాలనూ ప్రకటించేస్తోంది

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన అన్నదాతలకు, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇరవై రెండు రోజులుగా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద నాదెండ్ల మనోహర్, పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఒక రోజు చేపట్టిన నిరసన దీక్ష సాయంత్రం 5.30 గంటలకు విరమించారు.

అనంతరం, జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మనోహర్ మాట్లాడుతూ, రైతులకు అండగా నిలబడాలన్న గొప్ప ఉద్దేశంతో జనసేన పార్టీ, అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్షను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సూచించారు. రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

రాజకీయ పక్షాలను, శాసనసభ్యులను, మంత్రులను, భూములు త్యాగం చేసిన రైతులను విస్మరించి సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం బాధాకరమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తమ చేతుల్లో లేని నిర్ణయాలను సైతం ప్రకటించేస్తోందని, కర్నూలుకు హైకోర్టు తీసుకువెళ్తామని అబద్ధాలు చెబుతోందని, అది కేంద్రం పరిధిలోని అంశం అన్న విషయాన్ని మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News