Farmers: రాజస్థాన్ లో భూ సేకరణకు వ్యతిరేకంగా.. తమను తాము మెడలోతు వరకు పాతిపెట్టుకున్న రైతులు!
- గృహ నిర్మాణ పథకం కోసం రైతుల నుంచి భూసేకరణ
- నూతన భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని డిమాండ్
- ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇదే నిరసన అంటున్న రైతులు
తమ నుంచి సేకరించిన భూమికి నూతన భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రైతులు వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. పీకల్లోతు వరకు తమను తాము పాతిపెట్టుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. తమ డిమాండ్ నెరవేర్చేవరకు బయటకు రాబోమంటూ రాత్రంతా చలిలోనే గడిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిందీ ఘటన.
జైపూర్ శివారులోని నిండార్‌లో గృహ నిర్మాణ పథకం కోసం జైపూర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (జేడీఏ) రైతుల నుంచి 1300 బీగాల భూమిని సేకరించింది. అయితే, సేకరించిన భూమికి నామమాత్రపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు ఆందోళనకు దిగారు. నూతన భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా యువ సంఘర్ష సమితి చైర్మన్ డాక్టర్ నాగేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో రైతులు తమ భూముల్లో మెడలోతు వరకు గొయ్యి తీసుకుని తమను తాము పాతిపెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా రాత్రంతా అలానే ఉన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.