Jagan: నేడే 'అమ్మ ఒడి'కి శ్రీకారం.. సీఎం జగన్ ఇచ్చే రూ. 15 వేల కోసం వేచి చూస్తున్న 43 లక్షల మంది తల్లులు!
- నేడు ప్రారంభం కానున్న అమ్మ ఒడి
- బిడ్డలను బడికి పంపే తల్లికి రూ. 15 వేలు
- చిత్తూరులో ప్రారంభించనున్న సీఎం జగన్
అమ్మ ఒడి... తన బిడ్డలను బడికి పంపితే చాలు... ప్రతి కన్న తల్లి బ్యాంక్ ఎకౌంట్ లో ఏటా రూ. 15 వేలు పడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన వినూత్న సంక్షేమ పథకం. రాష్ట్రంలోని పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లను తగ్గించే ఉద్దేశంతో పాటు, సంపూర్ణ అక్షరాస్యత నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకమిది. ఈ పథకంలో లబ్దిదారులుగా ఇప్పటికే 43 లక్షల మందికిపైగా తల్లులను గుర్తించారు. ఒకటి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
నేడు ముఖ్యమంత్రి జగన్, చిత్తూరులో జరిగే ఓ కార్యక్రమంలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆపై ఒక్క క్లిక్ తో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు చేరనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి కాగా, సదరు బ్యాంకులకు ఖజానా నుంచి డబ్బు కూడా విడుదల అయింది. కాగా, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్లకు పెరిగినా ఈ పథకానికి అర్హులు కాదని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పథకం ఓట్లను తెచ్చి పెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇండియాలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం లేదని ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగించే ఎన్నో పథకాలను అమలు చేస్తోందని అంటున్నారు.