Chandrababu: రాజధాని ఇక్కడే అంటూ ప్రభుత్వం చెప్పే వరకు జేఏసీ కొనసాగుతుంది: చంద్రబాబునాయుడు
- జేఏసీకి నా అండ ఉంటుంది
- నేను సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ నేతల పాదయాత్రను అడ్డుకోలేదు
- రాజధానికోసం 11మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పడ్డ జేఏసీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జేఏసీ నేతల బస్సు యాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. పైగా బస్సును అడ్డుకున్నారెందుకంటే కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. 'నేను సీఎంగా ఉన్న సమయంలో జగన్ సహా ఇతర నేతలు పాదయాత్రలు చేశారు. నేను కూడా ఇదే రీతిన అడ్డుకుంటే వారి యాత్ర సాగేదా?' అని ప్రశ్నించారు. ఆటంకాలు ఎన్ని వచ్చినా.. అమరావతి రాజధానిపై పోరాటం ఆపే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.
రాజధానికోసం పోరాడుతూ ఇప్పటివరకు 11 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రాజధాని ఇక్కడే అంటూ ప్రభుత్వం ప్రకటించేవరకు జేఏసీ పనిచేయాలన్నారు. తన అండ దానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రకటనలు చేయడం కాదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలన్నారు. లాయర్లు ముందుండి పోరాడితే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కనకమేడల రవీంద్రకుమార్, మాగంటి బాబు, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ నేతలు పాల్గొన్నారు.