CAA: సీఏఏ చట్టబద్ధమైందని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్.. విచారణకు స్వీకరించమన్న సుప్రీంకోర్టు
- ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పిటిషన్ పై విచారణ చేపట్టం
- ఆందోళనలు తగ్గిన తర్వాతే విచారణకు స్వీకరిస్తాం
- చట్టం చెల్లుబాటును నిర్ధారించడమే కోర్టు విధి
- అది రాజ్యంగబద్ధమైందని కోర్టు ప్రకటించడం కుదరదు
సీఏఏపై దేశంలో చెలరేగుతున్న ఆందోళనల నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఆ అంశంపై దాఖలయ్యే పిటిషన్లు శాంతిని నెలకొల్పేందుకు తోడ్పడే విధంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమే అని ప్రకటించాలని దాఖలైన పిటిషన్ ను తప్పుబడుతూ.. రాజ్యాంగం చట్టబద్ధతను అవమానించే విధంగా పిటిషన్లు ఉండకూడదని పేర్కొన్నారు.
సీఏఏ రాజ్యాంగబద్ధమైందే అని ప్రకటించి, అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేసేలా ఆదేశించాలని వినీత్ దండా అనే న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో బోబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పిటిషన్ ను విచారణకు తీసుకోమని బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం చెల్లుబాటును నిర్ధారించడం వరకే కోర్టు విధి అంటూ, అది రాజ్యంగబద్ధమైందని కోర్టు ప్రకటించడం కుదరదని ధర్మాసనం పేర్కొంది. దేశంలో సీఏఏపై జరుగుతోన్న ఆందోళనలు తగ్గిన తర్వాత ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.