AmmaOdi: ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తారా?: ‘ఈనాడు’, ఏబీఎన్’పై మంత్రి బొత్స ఫైర్
- ‘అమ్మఒడి’ కింద రూ.6,400 కోట్ల రూపాయలు జమ చేశాం
- ఇది ఒక చరిత్ర.. ఏడు నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు
- వైసీపీ ప్రభుత్వంపై కొన్ని పత్రికలు, ఛానెల్స్ దుష్ప్రచారం తగదు
ఏపీ ‘అమ్మఒడి’ పథకం ద్వారా సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో ఆరువేల నాలుగు వందల కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని, ‘ఇది ఒక చరిత్ర’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేస్తోందని ప్రశంసించారు.
అయితే, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై కొన్ని పత్రికలు, కొన్ని ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’, ఏబీఎన్ ఛానెల్’పై మండిపడ్డారు. ‘అమ్మ ఒడి’పై ప్రభుత్వం ఇచ్చిన యాడ్ ఇదే పత్రికలో ఉందని, ఆ పత్రికలోనే ‘శ్రీమాన్ రామోజీరావు గారి తాలూకా స్వార్థం.. రామోజీరావుగారి తాలూకా సమాజ స్ఫూర్తి.. కాదు సామాజిక స్ఫూర్తి కార్యక్రమం కనిపిస్తుంది’ అంటూ ఆ పత్రికలో వెలువడ్ద కథనాన్ని చూపించారు.