Machilipatna: రాజధానిని తరలించమని ఈ నెల 18 లోగా సీఎం జగన్ ప్రకటన చేయాలి: సీపీఐ రామకృష్ణ డిమాండ్
- ఐదు కోట్ల ప్రజల తలరాతలు ఇద్దరే ఇద్దరు రాస్తున్నారు
- అందులో ఒకరు జగన్, మరొకరు విజయసాయిరెడ్డి
- ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లకు పచ్చ కామెర్లు ఏమైనా వచ్చాయా?
రాజధానిగా అమరావతే కొనసాగాలని.. ఈ విషయమై ఈ నెల 18న కేబినెట్ కమిటీ సమావేశంలోగా సీఎం జగన్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజధానిని తరలించవద్దంటూ మచిలీపట్నంలో ఈ రోజు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు ఐదు కోట్ల మంది ప్రజల తలరాతలు రాస్తున్నారని, వాళ్లిద్దరూ ఒకరు జగన్, మరొకరు విజయసాయిరెడ్డి అంటూ విరుచుకుపడ్డారు.
రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ తొలి బహిరంగ సభ మచిలీపట్నంలో జరుగుతోందని, ఇదే మచిలీపట్నంలో ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం ఆంధ్రరాష్ట్రంలో పోరాటం మొదలైందని గుర్తుచేశారు. ఈ రోజున అమరావతి రాజధాని పోరాటం ఇక్కడి నుంచి మొదలైందని, కచ్చితంగా విజయం సాధించి తీరుతామన్న విశ్వాసం వుందని అన్నారు.
రేపు మంత్రి పేర్ని నాని మచిలీపట్నం వస్తాడని, రాజధాని మారుస్తామని సీఎం జగన్ చెప్పారా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తాడంటూ తన ప్రసంగం మధ్యలో సెటైర్ విసిరారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు అమరావతి శ్మశానంలా కనపడిందని, అమరావతిలో ఆయన కనుక కనబడితే కచ్చితంగా తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అమరావతి ఎడారిలా కనపడిందని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు చేశారని, ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నవారికి పచ్చ కామెర్లు ఏమైనా వచ్చాయా? అంటూ మండిపడ్డారు.
ఆ కమిటీల సభ్యులు జగన్ ఏం చేయమంటే అది చేస్తారు!
సీఎం జగన్ పక్కా ఫ్యాక్షనిస్టు, బాగా కసితో ఉన్నాడంటూ రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మాట తప్పను, మడమ తిప్పను’ అని చెప్పే జగన్, రాజధాని విషయంలో మాటెందుకు మార్చారని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కమిటీలు ఏర్పాటు చేశామని చెబుతున్నారని, ఆ కమిటీల సభ్యులు జగన్ ఏం చేయమంటే అది చేస్తారని ఆరోపించారు.