Tamilnadu: చెక్‌పోస్టులోకి ప్రవేశించి ఎస్సైని కాల్చి చంపిన దుండగులు.. ప్రతీకార హత్యగా పోలీసుల అనుమానం
- తమిళనాడులో చెక్‌పోస్టులో ఎస్సైపై కాల్పులు
- తీవ్రవాదుల అరెస్ట్‌కు ప్రతీకారంగానే హత్య?
- ఎస్సై కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్న సీఎం
తమిళనాడులో ఓ ఎస్సైని ఇద్దరు ఆగంతుకులు తుపాకితో కాల్చి చంపారు. కన్యాకుమారి జిల్లా కలియక్కవిలై సమీపంలోని పడందాలుమూడు చెక్‌పోస్టు వద్ద జరిగిందీ ఘటన. స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఎస్సై విల్సన్ (58) రాత్రి విధుల్లో ఉండగా, చెక్‌పోస్టులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. మూడు బుల్లెట్లు విల్సన్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు.
తీవ్ర గాయాలపాలైన ఎస్సైని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. విల్సన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.
తీవ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడులో దాడుల కోసం ప్లాన్ చేసి బెంగళూరులో దాక్కున్న ముగ్గురు తీవ్రవాదులు మహ్మద్ హనీఫ్ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, మహ్మద్ సయ్యద్‌లను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్ట్‌కు ప్రతీకారంగానే ఎస్సై హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.