Lunar eclipse: ఈ దశాబ్దంలో తొలి గ్రహణం.. ఈ రాత్రికే మొదలు!
- ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు
- రాత్రి 10:37 గంటలకు ప్రారంభం కానున్న చంద్రగ్రహణం
- భారత్‌లో పాక్షికమే
ఈ దశాబ్దంలో తొలి గ్రహణానికి ఈ రాత్రే ముహూర్తం. ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు.. నాలుగు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు కనువిందు చేయనుండగా, నేటి రాత్రి తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలతోపాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది.
నేటి రాత్రి 10:37:44కు గ్రహణం ప్రారంభమై శనివారం తెల్లవారుజామున 2:42:19కు ముగియనుంది. అంటే దాదాపు నాలుగు గంటలపాటు గ్రహణం కొనసాగుతుంది. అయితే, భారత్‌లో ఇది పాక్షికమేనని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
జూన్ 5, 6వ తేదీల్లో ఏర్పడే మరో చంద్రగ్రహణం మాత్రం భారత్‌లో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సంభవించనున్న ఆరు గ్రహణాల్లో మూడు మాత్రమే భారత్‌లో కనిపించనున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.