Amaravati: అమరావతి మహిళలపై లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు
- మందడం, తుళ్లూరు గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తం
- లాఠీఛార్జి చేసిన పోలీసులు
- మహిళలు అనికూడా చూడకుండా తమపై లాఠీఛార్జి చేశారంటూ ఆగ్రహం
రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. మందడం, తుళ్లూరు గ్రామాల్లోని పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సద్ధమైన మహిళలు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు. మహిళల చేతిలోని అమ్మవారి చిత్రపటాలను కూడా పోలీసులు లాక్కున్నారు. ఈ క్రమంలో, పలువురు మహిళలకు గాయాలయ్యాయి. పోలీసుల వలయాన్ని దాటుకునే వారంతా ముందుకు కదులుతున్నారు.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీలో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములను ఇచ్చిన తమను శిక్షిస్తారా? అని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు. అమ్మవారి దీక్షలో ఉన్న తమపై దాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.