Andhra Pradesh: పిల్లలకు మేనమామ కాకపోయినా ఫర్వాలేదు కానీ శకుని మామ మాత్రం కావొద్దు: సీఎం జగన్ పై తులసిరెడ్డి సెటైర్
- 'అమ్మ ఒడి' పథకం ప్రారంభించిన సీఎం జగన్
- పిల్లలకు మేనమామలా తోడ్పాటునందిస్తానని ప్రకటన
- ఎద్దేవా చేసిన తులసిరెడ్డి
ఏపీ సీఎం జగన్ 'అమ్మ ఒడి' పథకాన్ని తీసుకువస్తూ రాష్ట్రంలోని అందరి పిల్లలకు మేనమామనై తోడ్పాటునందిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. పిల్లలకు మేనమామ కాకపోయినా ఫర్వాలేదు కానీ శకునిమామ మాత్రం కావొద్దని హితవు పలికారు. మాతృభాషను హత్య చేసిన ఈ హంతక ప్రభుత్వానికి అమ్మ అని పలికే అర్హత లేదని అన్నారు. ఇది 'అమ్మ ఒడి' కాదని, 'మమ్మీ ఒడి' అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఆంగ్లంపై అంత మోజుంటే తన పేపర్ ను ఆంగ్లంలోనే ప్రచురించాలని సవాల్ విసిరారు. అన్ని సంక్షేమ పథకాల నిధులను 'అమ్మ ఒడి'కి మళ్లించారని తులసిరెడ్డి ఆరోపించారు.