Leopard: చిరుతపులి దెబ్బకు పీజీ పరీక్షలు వాయిదా వేసిన తెలంగాణ అధికారులు
- తెలంగాణ వర్సిటీలో చిరుత సంచారం
- వాకింగ్ కు వెళ్లిన వారికి చిరుతపులి దర్శనం
- వర్సిటీలో తిరగాలంటే హడలిపోతున్న విద్యార్థులు, సిబ్బంది
చిరుతపులి అంటే భయం లేనిది ఎవ్వరికి చెప్పండి?
ప్రపంచంలోనే అత్యంత వేగగామి అయిన ఈ క్రూరమృగం రెప్పపాటులో పంజా విసిరి ప్రాణాలు తీయగలదు. తాజాగా, చిరుతపులి ప్రభావంతో ఓ విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకీ ఎక్కడో కాదు, డిచ్ పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా వర్సిటీలో చిరుతపులి సంచరిస్తోంది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన పలువురికి చిరుత కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. దాంతో వర్సిటీ ప్రాంగణంలో బయట తిరగాలంటేనే విద్యార్థులు, సిబ్బంది హడలిపోతున్నారు.
చిరుత కలకలంపై తెలంగాణ వర్సిటీ అధికారులు అటవీశాఖకు సమాచారం అందించగా, అటవీశాఖ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పీజీ పరీక్షలను కూడా వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షలను జనవరి 22 తర్వాత నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఆ చిరుత ఎక్కువగా ఎంసీఏ బిల్డింగ్ వద్ద తచ్చాడుతున్నట్టు విద్యార్థులు తెలిపారు. దాంతో ఆ ప్రదేశంలో పులి పాదముద్రల కోసం అటవీశాఖ అధికారులు వెదుకుతున్నారు.