Virat Kohli: బౌలర్ చేతిలో బంతి, పళ్లెంలో పూరీ.... రెండింటిపైనా ఒకే శ్రద్ధ అవసరం: కోహ్లీ
- ఫిట్ నెస్ కు ప్రాధాన్యమిచ్చే ఆటగాడిగా గుర్తింపు
- జంక్ ఫుడ్ జోలికి వెళ్లని కోహ్లీ
- అప్పుడప్పుడు డైట్ ప్లాన్ కు విరామం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటలో ఎంత తీవ్రత ఉంటుందో అతడి ప్రవర్తన అంత సరదాగా ఉంటుంది. తాజాగా చేసిన ఓ ట్వీట్ విపరీతంగా సందడి చేస్తోంది. బౌలర్ చేతిలోంచి దూసుకొచ్చే బంతి, ప్లేటులో పూరీ... ఈ రెండింటిపైనా ఒకే శ్రద్ధ అవసరం అంటూ ట్వీట్ చేశాడు.
సాధారణంగా కోహ్లీ తీసుకునే ఆహారం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఫిట్ నెస్ కు వంద శాతం ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ లెక్క ప్రకారమే తింటాడు. పైగా శాకాహారి. తాను చేసే పనికి ఎన్ని కెలోరీలు అవసరమైతే అంతమేర శక్తినిచ్చే బలవర్ధక ఆహారం మాత్రమే తీసుకుంటాడు. పైగా తాగే నీళ్లు కూడా విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటాడు.
అయితే, అప్పుడప్పుడు డైట్ ప్లాన్ పక్కనపెట్టి పూరీలు, శనగలతో చేసిన కూరలు తినేటప్పుడు కాస్త మితి తప్పకుండా జాగ్రత్తపడతానని తాజా ట్వీట్ ద్వారా వెల్లడించాడు. దూసుకొచ్చే బంతిపై ఎంత శ్రద్ధ చూపిస్తానో, పళ్లెంలో ఊరించే పూరీని తినడంలోనూ అంతే జాగ్రత్త పాటిస్తానని వివరించాడు. మోతాదు మించకుండా చూసుకుంటానని తన ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు.