Suryapet District: పోటీ చేయమని కోరినందుకు కృతఙ్ఞతలు.. కానీ క్షమించండి: మంత్రి జగదీశ్ రెడ్డి భార్య సునీత ప్రకటన
- పోటీ చేయమని కోరిన అభిమానులు, నాయకులు
- మా పిల్లల చదువు దృష్ట్యా పోటీ చేయడం లేదు
- పేద పిల్లలకు సేవలు కొనసాగిస్తానన్న మంత్రి భార్య
తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రోజుతో నామినేషన్లు దాఖలు చేయడం ముగిసింది. ఇదిలా ఉండగా, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి భార్య సునీతను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతూ టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు పోలా రాధాకృష్ణ పేరిట కరపత్రాలను పంచారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో సునీతను బరిలోకి దింపితే బాగుంటుందని ఆమె అభిమానులు, నాయకులు కోరుకున్నారు. ఈ విషయం స్థానికంగా ఆసక్తి రేకెత్తించడమే కాక, సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సునీత స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో తనను పోటీ చేయాలని కోరుతూ తనపై అభిమానం చూపించిన వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. 'అయితే, మీ కోరికను మన్నించలేకపోయినందుకు క్షమించాల్సిందిగా విఙ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆ ప్రకటనలో తెలిపారు. తన పిల్లల చదువు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ‘యస్ ఫౌండేషన్’ ద్వారా పేద పిల్లలకు అందిస్తున్న సేవలను ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు.