Telugudesam: ముఖ్యమంత్రి చెబితే పోలీసులు చేసేస్తారా? మీకు చట్టం తెలియదా?: చంద్రబాబునాయుడు
- ఐఏఎస్, ఐపీఎస్ లు రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలి
- చట్టాన్ని, మానవహక్కులను పోలీసులే ఉల్లంఘిస్తారా?
- వెస్ట్ గోదావరి ఎస్పీ.. పెద్ద పుడింగి
ముఖ్యమంత్రి చెబితే పోలీసులు చేసేస్తారా? మీకు చట్టం తెలియదా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, మీరు ఐపీఎస్ చేయలా? ఏం చెప్పారు ఐపీఎస్ లో? రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలని, ఒకవేళ ప్రభుత్వం తప్పుడు పనులు చేయమని చెప్పినా చేయొద్దని ట్రైనింగ్ లో వారికి చెబుతారని గుర్తుచేశారు.
అలాంటిది, చట్టాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించి మహిళలపైన, దళితులపైన, రైతులపైన దాడి చేస్తుంటే ఒక సీనియర్ నాయకుడిగా మాట్లాడే హక్కు తనకు ఉందని చెప్పారు. 'అమరావతి యుద్ధభూమిలా తయారైపోయింది.. ఇదేమన్నా పాకిస్థానా? ఆడబిడ్డలపై దాడి చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళుతున్నారు?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘వెస్ట్ గోదావరి ఎస్పీ పెద్ద పుడింగి’ అంటూ చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తమ డ్యూటీ చేయాలి, చట్ట ప్రకారం నడచుకోవాలే తప్ప, తనను రాకూడదని చెప్పడానికి వీళ్లెవరు? అంటూ మండిపడ్డారు. తనను ప్రజలు కలవకూడదని, తనతో మాట్లాడకూడదని చెబుతారా? తాను ఏమన్నా దేశ ద్రోహినా? అని ప్రశ్నించారు.