Chandrababu: తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ.. పలువురు నేతల హౌస్ అరెస్ట్
- అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ
- ర్యాలీలో పాల్గొననున్న చంద్రబాబు
- పండుగ సీజన్ కావడంతో అనుమతి నిరాకరించిన పోలీసులు
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఇవాళ తిరుపతిలో ఐక్య కార్యాచరణ సమితి ర్యాలీని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అయితే, ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. పండుగ సీజన్ కావడంతో అనుమతిని నిరాకరిస్తున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపారు.
మరోవైపు, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్, ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే, చంద్రబాబు ఈ మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయల్దేరుతారు. 2.10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నాలుగు కాళ్ల మంటపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించాల్సివుంది.