Amaravati: అమరావతి కోసం అవసరమైతే వ్యక్తిగత పోరాటం: ఎంపీ సుజనా చౌదరి
- రైతుల ఆందోళనలు చూస్తే బాధగా ఉంది
- మా పార్టీ కూడా సపోర్టు చేస్తుందని భావిస్తున్నా
- అమరావతిని అంగుళం కూడా కదపనివ్వం
రాజధాని అమరావతి విషయంలో రైతుల పోరాటానికి కేంద్రంలోని తమ ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నానని, ఈ విషయంలో అవసరమైతే తాను వ్యక్తిగత పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 'రాజధానిని కాపాడుకోలేకపోతే మాకీ పదవులు ఎందుకు? పదేళ్లుగా ఎంపీగా ఉండి ప్రయోజనం ఏమిటి?' అని అన్నారు.
రాజధాని అంశంపై ప్రతి నిమిషం ఏం జరుగుతోందో కేంద్రం తెలుసుకుంటోందని, కచ్చితంగా జోక్యం చేసుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. మహిళలు, రైతులు గుడికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ఆరునెలల పాలనలో ఇంత దారుణంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు.
ఏది చేసినా చట్ట ప్రకారం చేయాలని, అల్లకల్లోలం సృష్టించాలనుకోకూడదన్నారు. 144 సెక్షన్ విధించేందుకు సమయం, సందర్భం ఉండదా? అని సుజనా ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 13 జిల్లాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.