Amaravati: రైతుల ఆందోళనల్లో చొరబడి మహిళలపై దాడి చేస్తోన్న వ్యక్తి.. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు!
- తాను పోలీసునని చెప్పుకున్న వ్యక్తి
- ఐడీ కార్డు చూపాలని అడిగిన రైతులు
- లేదని చెప్పిన వ్యక్తి
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న పోరాటంలో కొందరు బయటి వ్యక్తులు వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. మహిళలపై దాడి చేస్తోన్న ఓ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.
ఆందోళనల్లో భాగంగా రైతుల మధ్య చొరబడుతోన్న ఆ వ్యక్తి తమపై దాడి చేస్తున్నాడని, దీంతో అతడిని పట్టుకున్నామని మందడం రైతులు చెప్పారు. అతడిని నిర్బంధించి నిలదీశామని, తాను పోలీసునని చెప్పాడని రైతులు తెలిపారు. అయితే గుర్తింపు కార్డు చూపాలని తాము అడగగా, అది తన వద్ద లేదని చెప్పాడని అన్నారు.
దీంతో అతడిని పోలీసులకు అప్పగించామని తెలిపారు. అతడు ఎవరు? ఎందుకు దాడులకు పాల్పడుతున్నాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులను తమపైకి పంపి దాడి చేయిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కాగా, మందడంలో ఎక్కడికక్కడ ముళ్ల కంచెలతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.