Janasean: ‘జనసేన’ నన్ను అడిగే పరిస్థితి, నేను చెప్పే పరిస్థితి లేవు: ఎమ్మెల్యే రాపాక
- నాకు ఏది మంచి అని అనిపిస్తే అది చేస్తాను
- నాపై పార్టీ ఎటువంటి బరువు బాధ్యతలు పెట్టలేదు
- ఈ రాష్ట్రం మళ్లీ విడిపోకూడదనే ‘మూడు రాజధానులు’
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన రాపాక, మంత్రి కొడాలి నానితో కలిసి యడ్లపందేల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో చర్చించే పరిస్థితి ఉండదని, వాళ్ల అభిప్రాయం వాళ్లు చెబుతారు, ‘నా అభిప్రాయం నేను చెబుతానని అన్నారు. ‘నాకు ఏది మంచి అని అనిపిస్తే అది చేస్తాను’ అని, తనకు వ్యక్తిత్వం ఉందని చెప్పిన రాపాక, తనపై పార్టీ ఎటువంటి బరువు బాధ్యతలు పెట్టలేదని అన్నారు.
జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం మళ్లీ విడిపోకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ ప్రస్తావించారంటూ ప్రభుత్వ ఆలోచనకు మద్దతు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని, మూడు పంటలు పండే భూములను ఇవ్వమని వారు చెబితే బలవంతంగా వాటిని లాక్కున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్ల మాటలు నమ్మి ధర్నాలు చేస్తున్న రైతులు సీఎం జగన్ వద్దకు వెళ్లి వారి కష్టాలు చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని సూచించారు.