Matrimonial: మ్యాట్రిమోనీ సైట్ లో చూసి, డాక్టరని నమ్మి... ఒకేసారి మోసపోయిన ఇద్దరు యువతులు!
- తప్పుడు ప్రొఫైల్ సృష్టించిన ఖమ్మం జిల్లా వాసి
- చూసి పరిచయం పెంచుకున్న అమ్మాయిలు
- డబ్బు అవసరమని చెప్పి మోసం
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో నకిలీ ప్రొఫైల్ ను సృష్టించిన ఓ యువకుడు, ఒకే సమయంలో విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను మోసగించి, పోలీసులకు చిక్కాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా సింగరేణి సూర్యా తండాకు చెందిన బానోతు సాయినాథ్ అలియాస్ సాయినాథ్ రెడ్డి, తనను తాను డాక్టర్ గా పరిచయం చేసుకుంటూ ఓ సైట్ లో తన ప్రొఫైల్ ను పెట్టాడు. దీన్ని చూసిన ఇద్దరు యువతులు, అతన్ని పరిచయం చేసుకోగా, పెళ్లాడతానని నమ్మించాడు.
ఈ క్రమంలో తనకు అర్జంట్ గా డబ్బులు అవసరమని చెప్పి, ఓ యువతి నుంచి రూ.1. లక్ష, మరో యువతి నుంచి రూ. 50 వేలు తన ఖాతాలో వేయించుకున్నాడు. ఆపై వారి ఫోన్ లను లిఫ్ట్ చేయడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఓ యువతి ఆగస్టు 22న, మరో యువతి డిసెంబర్ 9న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసును విచారించి, బ్యాంకు ఖాతా ఆధారంగా సాయినాథ్ ను గుర్తించిన పోలీసులు, అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
సాయినాథ్ బాధితుల్లో ఇంకా పలువురు ఉన్నట్టు విచారణలో గుర్తించామని, హైదరాబాద్ కు చెందిన యువతిని ఇలాగే మోసం చేసి, రూ. 2 లక్షల వరకూ కాజేశాడని, ఆపై బెంగళూరుకు చెందిన మహిళ నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని వెల్లడించారు.