Nara Lokesh: పోలీసులను వెనక్కి పిలిపించి ఇన్నిరోజులు చేసింది తప్పు అని జగన్ స్వయంగా ఒప్పుకున్నారు: నారా లోకేశ్
- కొన్నిరోజులుగా రాజధానిలో పోలీసుల మోహరింపు
- స్పందించిన నారా లోకేశ్
- మహిళా కమిషన్ పర్యటన నేపథ్యంలో పోలీసులను వెనక్కి పిలిచారంటూ ఆరోపణ
రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపించారంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రతి గ్రామంలో వెయ్యి మంది పోలీసులను దింపారని ఆరోపించారు.
అయితే, జాతీయ మహిళా కమిషన్ రాజధాని ప్రాంతానికి వస్తుందని తెలిసి పోలీసులను వెనక్కి పిలిపించారని, తద్వారా ఇన్నిరోజులు తాము చేసింది తప్పు అని జగన్ అంగీకరించారని లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, పోలీసులు ఉన్నప్పుడు రాజధాని గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది? మహిళా కమిషన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు లేకుండా గ్రామాలు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు.