Chandrababu: మిస్టర్ డీజీపీ, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు: చంద్రబాబు
- నరసరావుపేటలో అమరావతి జేఏసీ ర్యాలీ
- హాజరైన చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్నారు. పల్నాడు బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా, పోలీసులపైనా విమర్శనాస్త్రాలు సంధించారు.
రాజధాని ఇక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించేవరకు ఎవరూ విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. తమ వృత్తులను, పనులను కూడా వదులుకుని ముందుకు వస్తున్నారని కొనియాడారు. ఇది ఒక పార్టీకి చెందిన ఉద్యమం కాదని, ఒక వ్యక్తికి చెందిన ఉద్యమం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి సాగిస్తున్న ఉద్యమం అని తెలిపారు. జై అమరావతి అనేది అందరి నినాదం కావాలని అన్నారు.
"ఒక వ్యక్తి ఈ పోలీసులను ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి ఎంతో నష్టం చేస్తున్నాడు. డీజీపీ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. నా వద్ద కూడా పనిచేశాడు. డీజీపీ పదవి అయిపోగానే రాష్ట్రం నుంచి వెళ్లిపోతాడు. కానీ పోలీసులను ఒకటే అడుగుతున్నా. మనం ఇక్కడే ఉండాల్సిన వాళ్లం. సంయమనం పాటించాలి. ఇక్కడుండే పోలీసులు ఆడబిడ్డలను కొడతారా? రాజధాని కోసం గొలుసులు, గాజులు, ఉంగరాలు ఇచ్చారు మహిళలు. అలాంటి స్త్రీలపై దాడి చేస్తారా? తన తండ్రి హార్ట్ పేషెంట్ అని లాక్కెళ్లవద్దని పోలీసులను కోరిన శ్రీలక్ష్మిని కొట్టారు. బూటు కాలితో కొడితే ఆమెకు బలమైన దెబ్బలు తగిలాయి. మీకు లేరా కుటుంబసభ్యులు? మీరు మనుషులు కారా? అని అడుగుతున్నా. మీ కోడలికో, మీ చెల్లెలికో జరిగితే మీరు బాధపడరా?
ఈరోజు నేను ఆఫీసు నుంచి బయల్దేరుతుంటే రెండొందల మంది పోలీసులు వచ్చారు. నేనేమన్నా బందిపోటునా... అంతమంది పోలీసులను దేనికి పంపించాల్సి వచ్చిందని అడిగాను. 144 సెక్షన్ పెట్టామని చెప్పారు. వెళితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. మిస్టర్ డీజీపీ, ఇక్కడ భయపడేవాళ్లెవరూ లేరు. ఇదే సీఎం జగన్ గతంలో ఆంధ్రా పోలీస్ పై తనకు నమ్మకంలేదన్నాడు. ఆ రోజు ఏమైంది పోలీసుల సంఘం? ఇవాళ ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి కాగానే మీరు కూడా నేరాలు చేయాలా? అని పోలీసులను అడుగుతున్నా. రేపు మీ పిల్లల్ని పోలీసులు ఎక్కడికి పంపించుకుంటారు? మీ పిల్లలు కూడా ఇక్కడికే రావాలి.
చట్టాన్ని గౌరవించండి. చట్టాన్ని ఎవరైనా వారి చేతుల్లోకి తీసుకుంటే మాత్రం పోరాడతాం తప్ప వెనుదిరిగిపోయేదిలేదు. అమరావతిలో లోపం ఏంటి? ఎందుకు మార్చుతున్నారు? అమరావతి విషయంలో జగన్ చేసే దుర్మార్గానికి వైసీపీ నాయకులు కూడా పతనమైపోతారు. వాళ్లకు ఓట్లేసిన వాళ్లకు కూడా భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. రాష్ట్రానికి సెంటర్ ప్లేస్ ఏదని చిన్నపిల్లవాడ్ని అడిగినా అమరావతి అని చెబుతాడు. పిల్లలకు ఉన్నంత బుద్ధి కూడా ఈ సీఎంకు లేదు" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.