Arundhathi reddy: మహిళల టీ20 ప్రపంచకప్ భారత జట్టులో తెలంగాణ అమ్మాయి అరుంధతి రెడ్డి
- 22 ఏళ్ల అరుంధతి హైదరాబాద్ పేసర్
- ఐసీసీ టోర్నీలో ఆడనున్న రెండో తెలుగు వ్యక్తిగా గుర్తింపు
- 2018లో టీ20ల్లో అరంగేట్రం
వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి అరుంధతిరెడ్డికి చోటు దక్కింది. ఫలితంగా మిథాలీ రాజ్ తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడనున్న తెలుగు అమ్మాయిగా అరుంధతి రికార్డులకెక్కింది. పేసర్ అయిన 22 ఏళ్ల అరుంధతి 2018లోనే టీ20ల్లో అరంగేట్రం చేసింది. 14 మ్యాచుల్లో 11 వికెట్లు తీసింది.
ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. 15 మంది సభ్యులతో విడుదల చేసిన ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 16 ఏళ్ల రిచా ఘోష్ మాత్రమే కొత్త ప్లేయర్. అలాగే, ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న టీనేజ్ సెన్షేసన్ షెఫాలీ వర్మ కూడా తొలి ఐసీసీ టోర్నీ ఆడబోతోంది. టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు మెల్‌బోర్న్ వేదికగా జరిగే ముక్కోణపు టోర్నీ కోసం కూడా భారత జట్టును ఎంపిక చేశారు.
మహిళల టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తిశర్మ, పూజా వస్త్రాకర్, వేద కృష్ణమూర్తి, రాజేశ్వరీ గైక్వాడ్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్, శిఖా పాండే, రాధా యాదవ్.