Jayaprada: రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాలు కరెక్ట్ కాదు: నటి జయప్రద కీలక వ్యాఖ్యల వీడియో
- ప్రజల అభీష్టానుసారమే నిర్ణయాలు ఉండాలి
- మళ్లీ మళ్లీ మార్చడం సరికాదు
- అమరావతిపై స్పందించిన సీనియర్ నటి
ఏపీ రాజధాని విషయంలో ప్రజల అభీష్టానుసారమే నిర్ణయాలు ఉండాలని సీనియర్ నటి జయప్రద అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఒక్కసారి అమరావతి రాజధాని అని చెప్పిన తరువాత, మళ్లీ మార్చడం సరికాదని అన్నారు.
"నేను చెప్పేది ఏమిటంటే. నేను ఉత్తరప్రదేశ్ లో ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయాలు చూస్తూ ఉన్నాను. పాలసీస్ ప్రకారం, ప్రజల ఆలోచన ప్రకారం, వారి ఇష్టం ప్రకారం మనం చేయాలి. ఎందుకంటే, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. సో... మనం ఎన్నో ఖర్చులు పెట్టి, బయటి నుంచి వచ్చిన ఫండ్స్... ప్రజలు కూడా దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజల సుఖాన్ని చూసి నిర్ణయాలు తీసుకోవాలి" అన్నారు.
తనకు రాజకీయాలు, సినిమాలు రెండూ జీవితంలో సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. తన జీవితమంతా ఏదో ఒకరకంగా ప్రజలతోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనకు ఎటువంటి లక్ష్యాలూ లేవని, అయితే, ప్రజలకు చేయాల్సింది మాత్రం చాలా ఉందని అనుకుంటున్నానని అన్నారు.