budda venkanna: ఆర్కే.. రాజీనామా చేసి మళ్లీ నిలబడు.. మంగళగిరిలో లోకేశ్ బాబు మళ్లీ పోటీ చేస్తారు: బుద్ధా వెంకన్న
- లోకేశ్ గెలిస్తే అమరావతిని ఇక్కడే ఉంచండి
- ఈ సవాలుకి ఒప్పుకుంటారా?
- మీకు మంగళగిరి ప్రజలు ఎక్కువా? జగన్ ఎక్కువా?
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేపట్టిన ర్యాలీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 'ఆర్కేకి మంగళగిరి ప్రజలు ఎక్కువా? జగన్ ఎక్కువా? జగన్ మెప్పుకోసం ఇటువంటి పనులు చేద్దామనుకుంటున్నారు. ఇది కుదరదు. జగన్ ముఖ్యమా? ఓట్లేసి గెలిపించిన ప్రజలు ముఖ్యమా?' అని ప్రశ్నించారు.
'రైతులు ఉద్యమాలు చేస్తుంటే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఎమ్మెల్యేలను ఎక్కడా చూడలేదు. కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు ఉంది. ప్రజలకు మంచి చేయాలని వీళ్లకు లేదు' అని బుద్ధా వెంకన్న అన్నారు.
'మంగళగిరిలో భద్రతా సిబ్బంది లేకుండా మీరు రోడ్లపైకి వస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంగళగిరిలో లోకేశ్ బాబు మళ్లీ పోటీ చేస్తారు. లోకేశ్ గెలిస్తే అమరావతిని ఇక్కడే ఉంచండి. ఈ సవాలుకి ఒప్పుకుంటారా? నాటకాలు ఆడొద్దు.. మా సవాలును స్వీకరించాలి' అని ఆయన డిమాండ్ చేశారు.
'మా సవాలు స్వీకరిస్తే ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారో, సానుకూలంగా ఉన్నారో తెలిసిపోతుంది. ఆర్కే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఆయనొక బొమ్మలాంటి వారు. జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నారు' అని ఎద్దేవా చేశారు.
జగన్ దెబ్బకి ఏపీ వారు తెలంగాణకు వెళ్తున్నారని, సంక్రాంతి రోజైనా అమరావతి రాజధానిపై మనసు మార్చుకోవాలని బుద్ధా వెంకన్న అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు.