Varanasi: కాశీ విశ్వేశ్వరుడి గర్భాలయ ప్రవేశానికి ‘డ్రెస్ కోడ్’
- భక్తులు జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే
- పురుషులు ధోతీ-కుర్తా, స్త్రీలు చీరలు ధరించాలి
- త్వరలో అమలుకానున్న కొత్త నిబంధనలు
వారణాసిలోని విశ్వేశ్వరుడి గర్భాలయంలోకి ప్రవేశించాలనుకునే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా విభాగం నూతన నిబంధనలను ప్రకటించింది.
గర్భగుడిలోని జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలనుకునే భక్తులు సంప్రదాయక దుస్తులు ధరించాలని, పురుషులు ధోతీ-కుర్తా, స్త్రీలు చీర లాంటివి ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ సంప్రదాయ దుస్తుల్లో రాని భక్తులను జ్యోతిర్లింగం స్పర్శదర్శనానికి అనుమతించమని, దూరం నుంచే దర్శించుకోవాలని పేర్కొంది.
వారణాసి ఆలయంలో ఈ డ్రెస్ కోడ్ నిబంధనలను త్వరలోనే అమలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, కాశీ విశ్వనాథ ఆలయం తీసుకున్న నిర్ణయంతో మోడ్రన్ దుస్తులు ప్యాంట్, షర్టు, జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వంటి దుస్తులు ధరించి శివలింగాన్ని స్పర్శించడం ఇకపై కుదరదు.