Roja: అమరావతిలో మగవాళ్లు లేరా? వాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ములేదా?: ఎమ్మెల్యే రోజా
- ఆడవాళ్లను రోడ్లపైకి పంపిస్తారా?
- పోలీసులు కొట్టారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తారా!
- చంద్రబాబు లాంటి వ్యక్తి మా జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో చేస్తున్న ఉద్యమంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయనేతలు ఆడవాళ్లను ముందుపెట్టి ఉద్యమం చేయిస్తున్నారని, ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారా? అని ఘాటుగా విమర్శించారు. అమరావతిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆడవాళ్లను రోడ్లపైకి పంపించి పోలీసులు కొట్టారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అమరావతిలో మగవాళ్లు లేరా? వాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ములేదా? మీరు చేసిన తప్పులకు ఆడవాళ్లను ఎందుకు బలిచేస్తున్నారు?’ అంటూ ఆమె ప్రశ్నించారు.
అమరావతి ప్రాంత మహిళలందరూ స్వార్థంతోనే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించిన రోజా, హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి ఇక్కడికి బస్సుల్లో వచ్చి ధర్నాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ కు సన్నిహితుడైన ఒక దర్శకుడు కూడా మనవాళ్లు హైదరాబాద్ నుంచి వెళ్లి ధర్నాలు బాగా చేస్తున్నారని ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారని విమర్శించారు.
చంద్రబాబు లాంటి వ్యక్తి చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు తాము సిగ్గుపడుతున్నామని ధ్వజమెత్తారు. రాజధాని అంశంపై టీడీపీ నేతలు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని, సీఎం జగన్ కనుక కోరుకుంటే రాజధానిని కడపలో ఏర్పాటు చేసుకునేవారని రోజా వ్యాఖ్యానించారు.