Chidambaram: సీఏఏపై విమర్శకుల ప్రశ్నలను ప్రధాని మోదీ స్వీకరించాలి: పి చిదంబరం
- మీడియా ప్రశ్నలన్నింటినీ మేము ఎదుర్కొంటున్నాం
- చర్చల ద్వారా ప్రజల సందేహాలు తొలగుతాయి
- విమర్శకులను ఎంచుకుని ప్రశ్నలను ఎదుర్కోవడమే మీకున్న మార్గం
సీఏఏపై మోదీ ప్రభుత్వం విమర్శకులనుంచి ప్రశ్నలను స్వీకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. ఈ చట్టంతో ఏ ఒక్కరి పౌరసత్వం రద్దుకాదంటున్న మోదీ ప్రశ్నలను ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. చర్చల ద్వారా ప్రజల సందేహాలు తొలగుతాయన్నారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీలపై ప్రతిపక్షాలతో సమావేశం కావడానికి ముందు చిదంబరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలను శాంతింపజేసేందుకు పెద్ద పెద్ద వేదికల నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తుంటారు. కానీ, ఎలాంటి ప్రశ్నలు స్వీకరించరు. మేము మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రశ్నలను ఎదుర్కొంటాం. ప్రస్తుతం ఎవరైనా ఐదుగురు విమర్శకుల్ని ఎంచుకుని వారి నుంచి ప్రశ్నలను స్వీకరించడమే ప్రధాని ముందున్న ఏకైక మార్గం. ఈ సూచనకు ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.