ICICI: ఐసీఐసీఐ నిర్లక్ష్యం... తన రూ. 43 లక్షలు పోయాయని బోరుమన్న బాధితుడు!
- 2015లో ఎఫ్డీ వేసి యూఎస్ వెళ్లిపోయిన బాధితుడు
- నెలల వ్యవధిలోనే డబ్బు మాయం
- నిర్లక్ష్యంపై ఐసీఐసీఐకి వ్యతిరేకంగా తీర్పు
- అయినా డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంకు
ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం ఓ ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాలోని రూ. 43.07 లక్షలను మాయం చేసింది. బాధితుడైన ప్రవాస భారతీయుడు ఉత్తమ్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు, 2015లో ఆయన సికింద్రాబాద్ లోని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో రూ. 50 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చేసి, యూఎస్ వెళ్లిపోయారు. ఆపై అదే ఏడాది డిసెంబర్ లో తనిఖీ చేసుకోగా, పాస్ వర్డ్ మారినట్లు సమాచారం అందింది. ఆపై బ్యాంకును సంప్రదించగా, అటునుంచి పాస్ వర్డ్ మార్చుకోవాలన్న సూచన వచ్చింది. పాస్ వర్డ్ మార్చిన తరువాత ఖాతాలో చూసుకోగా, రూ.43,07,535 విత్ డ్రా అయినట్లు తెలిసింది.
దీనిపై బ్యాంకు అధికారుల స్పందన తృప్తికరంగా లేకపోవడంతో ఉత్తమ్ కుమార్, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, రూ. 2 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. నిందితుల్లో కొందరు విదేశాలకు పారిపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే తాను మోసపోయానని సచివాలయంలోని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (అడ్జుడికేటింగ్ అధికారి) ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన ఉన్నతాధికారులు, డబ్బు పోవడానికి బ్యాంకుదే బాధ్యతగా తేల్చి, గల్లంతైన సొమ్మును 9 శాతం వడ్డీ, ఖర్చుల కింద రూ. 50 వేలు, మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు రూ. 5 లక్షలు కలిపి చెల్లించాలని ఆదేశించారు. అయినా బ్యాంకు ఈ డబ్బును చెల్లించకపోవడంతో బ్యాంకు ఆస్తులను జప్తు చేసి, తనకు న్యాయం చేయాలని ఉత్తమ్ కుమార్ మరోసారి అడ్జుడికేటింగ్ విభాగాన్ని ఆశ్రయించారు.