Ladoo: ఉచితంగా లడ్డూలు ఇవ్వాలా? వద్దా?: టీటీడీలో కొత్త చర్చ
- ప్రతి భక్తునికీ ఓ ఉచిత లడ్డూ
- ఆపై రూ. 50కి ఓ లడ్డూ
- ఇంకా ఖరారు కాని విధివిధానాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తునికీ ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై టీటీడీ పునరాలోచనలో పడింది. ప్రతి భక్తునికీ ఒక లడ్డూను ఇవ్వాలని, ఆపై అదనంగా కావాలనుకుంటే ఒక్కొక్కటి రూ. 50కి కొనుగోలు చేయవచ్చని గత నెలలో టీటీడీ పాలకమండలి తన నిర్ణయాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. సబ్సిడీపై లడ్డూలను విక్రయిస్తున్న నేపథ్యంలో లడ్డూల తయారీ భారమవుతూ ఉందని చెబుతూ టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
దీనిపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో లడ్డూల పంపిణీపై విధివిధానాల రూపకల్పన చేస్తున్నామంటూ, శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. తిరుమలలోని పాత అన్నదాన సత్రం సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరిగింది. ఆపై హరీంద్రనాథ్ మాట్లాడుతూ, ఉచిత లడ్డూ పంపిణీపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, సాధారణ రోజులతో పాటు అన్ని పర్వదినాల్లోనూ అంతరాయం లేకుండా లడ్డూలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని మాత్రం నిర్ణయించామని వెల్లడించారు.