Dibai: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని తాకిన మెరుపు
- ఈ షాట్ తీయడానికి ఏడేళ్లుగా శ్రమిస్తున్న ఫొటోగ్రాఫర్
- ఎట్టకేలకు ఫలించిన కల
- భగవంతుడే తనకు ఈ అవకాశాన్ని కల్పించాడన్న జొహైబ్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టూరిస్ట్ డెస్టినేషన్ దుబాయ్ లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారంనాడు ప్రారంభమైన వర్షాలు వారాంతం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని ఓ మెరుపు తాకింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ ఫొటోగ్రాఫర్ తన కమెరాలో బంధించాడు.
జొహైబ్ అంజుమ్ అనే ఫొటోగ్రాఫర్ ఈ షాట్ ను తీయడానికి గత ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఎడారి దేశమైన దుబాయ్ లో వర్షాలు పడిన ప్రతిసారి బుర్జ్ ఖలీఫా ఎదుట క్యాంప్ వేసుకుని... కెమెరా పట్టుకుని మెరుపు కోసం ఎదురుచూసేవాడు. ఈ రకంగా రాత్రుళ్లు మొత్తం అప్రమత్తంగా ఉండేవాడు. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించింది. బుర్జ్ ఖలీఫాను తాకుతున్న మెరుపును పర్ఫెక్ట్ గా వీడియో తీశాడు. బుర్జ్ ఖలీఫా ఎత్తు 2,720 అడుగులు.
ఈ సందర్భంగా జొహైబ్ మాట్లాడుతూ, ఈ అద్భుతమైన అవకాశాన్ని తనకు భగవంతుడే కల్పించాడని చెప్పాడు. బుర్జ్ ఖలీఫాను మెరుపు తాకిన అద్భుత సన్నివేశంతో తనకు 2020 సంవత్సరం ప్రారంభమైందని తెలిపాడు.