Telangana: ఎత్తిపోతల పథకాలపై కౌంటర్ దాఖలు చేయాలంటూ.. టీఎస్ సర్కార్ కు సుప్రీం ఆదేశం
- అవినీతి జరిగిందంటూ నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్
- కౌంటర్ దాఖలుకు రెండువారాల గడువు
- తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎత్తి పోతల పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ.. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిల్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిపై నాగం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.
ఈ నేపథ్యంలో నాగం తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టిన సంస్థలపై ఐటీ దాడులు జరిగిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. పిటిషన్ లో ఐటీ శాఖను కూడా రెస్పాండెంట్ గా చేర్చాలని కోర్టును కోరారు. కాగా పిటిషనర్ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువునిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.