Nirbhaya: నిర్భయ కేసులో ట్విస్ట్... రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేశ్ సింగ్
- క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం
- ఈ నెల 22న నిర్భయ దోషుల ఉరితీతకు సన్నాహాలు
- రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ముఖేశ్ సింగ్ దరఖాస్తు
సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన దోషులను ఉరితీసేందుకు ఓవైపు తీహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతుండగా, దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు. తనకు మరణశిక్ష నుంచి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని ఇప్పటికే ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ దోషులు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం దక్కలేదు. వారి పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ గతంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను క్షమాభిక్ష కోరినా, అందుకు అర్హుడు కాదంటూ అతడి దరఖాస్తును కొట్టివేశారు. ఇప్పుడు ఉరికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ముఖేశ్ సింగ్ చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు.