Pullela Gopichand: ఇప్పుడు మొసలి కన్నీరు కార్చొద్దు.. పుల్లెల గోపీచంద్‌పై గుత్తా ‘జ్వాల’!
- సైనా తన అకాడమీ వీడడం వెనక ప్రకాశ్ పదుకొనే ఉన్నారన్న గోపీచంద్
- గోపీచంద్ బయోపిక్‌లో ప్రకాశ్‌పై తీవ్ర ఆరోపణలు
- వివాదం మధ్యలోకి గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన జీవిత చరిత్ర ‘డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్: ఇండియా అండ్ ఒలింపిక్ గేమ్స్’ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలపై ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాల విరుచుకుపడింది. గోపీచంద్ తన పుస్తకంలోని ‘బిట్టర్ రైవలరీ’ అనే చాప్టర్‌లో మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన అకాడమీ వీడడానికి ప్రకాశ్ పదుకొనె కారణమని ఆరోపించాడు. అంతేకాదు, అతడి గురించి చెప్పడానికి మంచి విషయం ఒకటీ లేదన్నాడు.
గోపీచంద్ ఆరోపణలను ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) మంగళవారం ఖండించింది. సైనా వెనక తాము లేమని, గోపీచంద్ అకాడమీని ఆమె వీడడంలో తమ పాత్ర లేదని వివరణ ఇచ్చింది. పీపీబీఏ ఇచ్చిన వివరణను గుత్తా జ్వాల ట్వీట్ చేస్తూ.. గోపీచంద్‌పై మండిపడింది. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న ఆ వ్యక్తే అప్పట్లో హైదరాబాద్‌ను విడిచిపెట్టి ప్రకాశ్ సర్ వద్ద శిక్షణ పొందేందుకు వెళ్లాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం తనను ఆశ్చర్యపరుస్తోందని ట్వీట్ చేసింది.
జ్వాల ట్వీట్‌కు ‘ఇండియన్ ఒలింపిక్ డ్రీమ్’ అనే ట్విట్టర్ యూజర్ స్పందించారు. ఎవరూ మొసలి కన్నీరు కార్చడం లేదని, బయటకు రాని పుస్తకం గురించి ముందే అందరినీ నేరుగా నిందించడం సరికాదని గుత్తా జ్వాలకు ఆ యూజర్ హితవు పలికారు. గాయంతో బాధపడుతున్న సైనాను ఒలింపిక్స్‌కు పంపడం పెద్ద తప్పని, ఈ విషయంలో అప్పటి కోచింగ్ స్టాఫ్‌ను ప్రశ్నించాలని ఆ యూజర్ పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు సైనా బదులిస్తూ.. తాను ప్రశ్నిస్తానని జవాబిచ్చింది. మరో ట్వీట్‌లో అప్పటి నేషనల్ క్యాంపులో తానూ సభ్యురాలినేనని, అప్పట్లో ఏం జరిగిందో తనకు తెలుసని జ్వాల పేర్కొంది.