Arvind Kejriwal: కేజ్రీవాల్ పై శశిథరూర్ తీవ్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల విమర్శలతో తెలివిగా క్షమాపణలు!
- కేజ్రీవాల్ బాధ్యతలేని అధికారాలను కోరుకుంటున్నారన్న శశిథరూర్
- నపుంసకులు మాత్రమే ఇలాంటి అధికారాలను కోరుకునే వారంటూ తీవ్ర వ్యాఖ్యలు
- ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలేంటంటూ నెటిజన్ల విమర్శలు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఇటీవల కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్)పై కేజ్రీవాల్ విమర్శలు చేస్తున్నారు కానీ, ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఢిల్లీలో జరుగుతున్న హింసపై ముఖ్యమంత్రిగా చూపాల్సిన నిబద్ధతను కూడా ఆయన చూపడం లేదన్నారు. అదే మరో రాష్ట్రంలో విద్యార్థులపై హింస జరిగితే సీఎం వారిని పరామర్శించేవారని, కేజ్రీవాల్ బాధ్యత లేని అధికారాలను కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇలాంటి అధికారాలను నపుంసకులు మాత్రమే కోరుకునేవారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
థరూర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఓ ప్రజాప్రతినిధిని, అందునా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విరుచుకుపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో శశిథరూర్ చాలా తెలివిగా స్పందించారు. బాధ్యతలు లేని అధికారం అన్న తన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయనిపించిన వారందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.
అది బ్రిటిష్ రాజకీయాల్లోని ఓ పాత నానుడి అని, ప్రముఖ రచయిత కిప్లింగ్, బ్రిటన్ ప్రధాని స్టాన్లే బాల్డ్విన్ల కాలంలో దానిని వినియోగించేవారని గుర్తు చేశారు. ఇటీవల రచయిత టామ్ స్టాపర్డ్ కూడా వాడారని అన్నారు. అయితే, దీని ఉపయోగం ఇప్పుడు సమంజసం కాదని తాను గుర్తించానని, అందుకనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలివిగా పేర్కొన్నారు.