Nara Bhuvaneswari: కోడలిని తీసుకుని తుళ్లూరు బయలుదేరిన నారా భువనేశ్వరి!
- అమరావతి రైతులకు పరామర్శ
- పలు గ్రామాల్లో పర్యటించనున్న చంద్రబాబు ఫ్యామిలీ
- ఇవి సంక్రాంతి నిరసనలంటున్న రైతులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరి, ఈ ఉదయం తన కోడలు, మాజీ మంత్రి లోకేశ్ భార్య బ్రాహ్మణితో కలిసి రాజధాని గ్రామాల పర్యటనకు బయలుదేరారు. మరికాసేపట్లో తుళ్లూరు చేరుకోనున్న వీరు, అక్కడ ధర్నా చేస్తున్న రైతులు, మహిళలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మందడం, వెలగపూడి గ్రామాల్లోనూ వీరి పర్యటన సాగనుంది. ఆపై చంద్రబాబు కూడా వీరితో కలవనున్నారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతులకు చంద్రబాబు కుటుంబం సంఘీభావం తెలుపనుంది.
కాగా, నేడు జరిగేవి సంక్రాంతి సంబరాలు కాదని, సంక్రాంతి నిరసనలని అమరావతి పరిసర గ్రామాల రైతులు చెబుతున్నారు. తమ నుంచి భూములు తీసుకుని, తమకు నిలువ నీడ లేకుండా చేసి, ఇప్పుడు తమను రోడ్డుపై పడేశారని ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల కోసం చంద్రబాబు ఫ్యామిలీ, చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు పయనమవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అమరావతి రైతుల నిరసనల దృష్ట్యా, చంద్రబాబు సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటానని ముందే ప్రకటించారు.