Phone charger: ఫోన్ ఏదైనా ఇక చార్జెర్ ఒకటే.. బహుళ ప్రయోజన డివైస్ కోసం చట్టం!
- ఏకగ్రీవంగా తీర్మానం చేసిన యూరోపియన్ యూనియన్
- ఫోన్లు, టాబ్లెట్లు, పోర్టబుల్ పరికరాలన్నింటికీ ఒకే పరికరం
- వినియోగదారులకు గొప్ప ఊరట
చార్జెర్ మర్చిపోతే సమస్య లేదు. వేరెవరి చార్జెర్ పనిచేయదన్న చింత లేదు. ఎవరి చార్జెర్ అయినా ఇట్టే వినియోగించుకునే రోజు దగ్గరలోనే ఉంది. అదెలా అంటారా? బహుళ ప్రయోజన చార్జెర్ల తయారీకి ఏకంగా యూరోపియన్ పార్లమెంటు తీర్మానం చేయడమే ఇందుకు కారణం.
వివరాల్లోకి వెళితే... ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య. ముఖ్యంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.
నిర్లక్ష్యం, వ్యాపారంలో పోటీ, మార్కెటింగ్ టెక్నిక్....ఇలా సవాలక్ష కారణాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి అనుబంధ పరికరాలు తయారవుతున్నాయి. కాలపరిమితి తీరిన తర్వాత ఈ వ్యర్థాలు పేరుకుపోయి గుదిబండలా మారుతున్నాయి.
వీటిని వదిలించుకోవడం ఆయా కంపెనీలకు, తద్వారా ఆయా దేశాలకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని అడ్డుకోవాలంటే తయారీ సమయంలోనే నియంత్రణ పాటిస్తే మంచిదని, ముఖ్యంగా బహుళ ప్రయోజన డివైస్ల తయారీతో సత్ఫలితాలు సాధించవచ్చునని యూరోపియన్ యూనియన్ దేశాల అభిప్రాయం.
తాజా ప్రతిపాదనపై వచ్చే యూరోపియన్ పార్లమెంటరీ సమావేశాల్లో ఓటింగ్ కూడా నిర్వహించనున్నారు.