Amaravati: రాజధాని అంటే జగన్ ఒక్కరి అభిప్రాయం కాదు: జేసీ దివాకర్ రెడ్డి
- ఇది 29 గ్రామాల సమస్య కూడా కాదు
- మొత్తం రాష్ట్రానిది
- అంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలి
సంక్రాంతి రోజు కూడా అమరావతిలో నిరసన తెలియజేస్తున్న రైతులకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన టీడీపీ నాయకుడు జె.సి.దివాకరరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం కేవలం జగన్‌కి పరిమితం కాదన్నారు. అలాగే ఇది 29 గ్రామాల సమస్య కూడా కాదని, రాష్ట్రం సమస్యని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. ఏడాది పోతే వై.ఎస్.భారతి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారని, ఆమె వచ్చి మరోచోట రాజధాని అంటే తరలిస్తారా అని ప్రశ్నించారు.
సంక్రాంతి రోజు ఇటువంటి పరిస్థితి దారుణమని, దీంతో సీఎం జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే అందరూ రోడ్లపైకి వచ్చి భయం పుట్టించాలని పిలుపునిచ్చారు. రాయల సీమకు విశాఖ చాలా దూరమని, అధికారుల కోసం అంత దూరం వెళితే అక్కడ ఎవరూ లేకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఈనెల 23వ తేదీన సమావేశమవుతామని, ఏం చేయాలన్నదానిపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు శాంతియుత పోరాటం చేయమంటున్నారు కానీ, అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదన్నారు.