Telangana: దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్లు బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తెస్తారు?: తెలంగాణ డిప్యూటీ సీఎం
- ఎన్నార్సీపై వైఖరి వెల్లడించిన మహమూద్ అలీ
- చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు ఉండవని వెల్లడి
- పౌరసత్వం పేరుతో దేశ ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని హితవు
తెలంగాణలో ఎన్నార్సీని అమలు చేయబోమని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు ఉండవని, భారత్ లో దశాబ్దాలుగా ఉంటున్నవాళ్లు బర్త్ సర్టిఫికెట్లు తీసుకురమ్మంటే ఎక్కడినుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న హిందువులకు భారత పౌరసత్వం ఇవ్వడం మంచి ఆలోచన అని, కానీ పౌరసత్వం పేరుతో దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.
లోక్ సభలో ఎన్నార్సీ బిల్లుపై టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు దీనిపై బహిరంగంగా మాట్లాడకపోయినా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాత్రం ఎన్నార్సీ అమలు తెలంగాణలో కుదరదని స్పష్టం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీ కారణంగా ప్రజల్లో లేనిపోని భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.