Srikakulam District: పోరాడి సాధించుకున్నారు.. నాగావళి నదిపై వంతెన కల నెరవేరనుంది!

  • బలసలరేవు వద్ద నిర్మాణానికి ప్రభుత్వం సుముఖత 
  • రూ.60 కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఆర్ఎండ్ బీ అధికారులు 
  • 794 రోజుల పోరాటానికి ప్రతిఫలం

అది రెండు గ్రామాలను మాత్రమే కలిపే వంతెన కాదు. ఎన్నో జీవితానుబంధాలకు చెరగని జ్ఞాపకమైన సంధానకర్త. కానీ ప్రభుత్వాల తీరు, స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా దశాబ్ద కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో గ్రామస్థులే సుదీర్ఘ పోరాటానికి తెరలేపారు. 794 రోజులపాటు వారు చేపట్టిన మౌన దీక్షకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రూ.60 కోట్లతో ఆర్ఎండ్ బీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని వాల్తేరు, ఆమదాలవలస మండలంలోని ఇసుకల పేట గ్రామాల మధ్య బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మించాలన్నది ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల. 1999లో ఇక్కడి వంతెన నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసింది. భూ పరీక్షల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ జీవో రద్దయింది.

2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్లీ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఈసారి బలసలరేవు వద్ద కాకుండా వేరేచోట నిర్మించాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ వాల్తేరుతోపాటు సమీప నదీతీర ప్రాంత గ్రామాల ప్రజలు 'వంతెన సాధన సమితి'గా ఏర్పడి పోరాటానికి సిద్ధమయ్యారు. పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలు, ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు.

దీంతో 2017 ఫిబ్రవరి 19న వాలేరు శిబిరాన్ని ఏర్పాటుచేసి మౌనదీక్ష చేపట్టారు.ఈ దీక్షకు అప్పట్లో ప్రస్తుత స్పీకర్ తమ్మినేని, మంత్రి బొత్స, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులతోపాటు సీపీఐ నారాయణ, జన సేన నేత పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపారు.

మొన్నటి ఎన్నికల ప్రచారంలో జగన్ తల్లి విజయమ్మ వంతెన నిర్మాణానికి స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో గత ఏడాది ఏప్రిల్ 24న  అంటే 794 రోజుల తర్వాత వీరు దీక్ష విరమించారు. త్వరలోనే ఈ హామీ కార్యరూపం దాల్చనుండడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే 40 గ్రామాల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. 

  • Loading...

More Telugu News