Pawan Kalyan: పొత్తా? విలీనమా?... జనసేన, బీజేపీ కీలక సమావేశం మొదలు!

  • ఈ వారం ప్రారంభంలో జేపీ నడ్డాతో పవన్ చర్చలు
  • ఆపై మారిన ఏపీ రాజకీయ పరిణామాలు
  • భవిష్యత్ పై చర్చించనున్న ఇరు పార్టీలు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలతో, జనసేన నేతల కీలక సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. ఈ వారం ప్రారంభంలో రెండు రోజుల పాటు హస్తినలో మకాం వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి, పార్టీని అధికారానికి దగ్గరగా తీసుకుని వెళ్లాలని నడ్డా కోరినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై అప్పటికప్పుడు ఎటువంటి సమాధానాన్నీ చెప్పని పవన్ కల్యాణ్, 2024లో వచ్చే ఎన్నికల వరకూ కలిసి పని చేద్దామని కోరినట్టు కూడా వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇరు పార్టీల భవిష్యత్ వ్యూహాలపై చర్చించేందుకు విజయవాడ వేదికైంది. జనసేన తరఫున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున కన్నా లక్ష్మీ నారాయణ, జీవీఎల్, సునీల్ దేవధర్ హాజరు కానున్నారు.

స్థానిక ఎన్నికల్లో పొత్తు, రాజధాని అంశం, ప్రజా సమస్యలపై ఉమ్మడి ప్రణాళిక తదితర అంశాలపై ఇరు పార్టీల మధ్యా చర్చలు జరగనున్నాయని తెలుస్తుండగా, బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేయడం, అందుకు విధివిధానాలపై నేతలు మాట్లాడుకోనున్నారని జనసేనలోని ఓ వర్గం చెబుతోంది. నిన్న జీవీఎల్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు, అమరావతి అంశం మాత్రమే తమ అజెండా కాదని వ్యాఖ్యానించడం విలీనం ఊహాగానాలను మరింతగా పెంచింది. మొత్తానికి నేడు జరగనున్న జనసేన, బీజేపీ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News