CPI Narayana: మూడు రాజధానులు ఏంటయ్యా? అంటూ జాతీయ స్థాయిలో నవ్వుకుంటున్నారు: సీపీఐ నారాయణ
- మహిళలపై పోలీసులు దాడులకు పాల్పడడం ఏంటి?
- మహిళల దగ్గర బాంబులు లేక మారణాయుధాలు ఉన్నాయా?
- రాజధానిని మూడు ముక్కలు చేసే హక్కు ముఖ్యమంత్రికి లేదు
అమరావతి రైతులు చేస్తోన్న ఉద్యమం జాతీయ స్థాయికి వెళ్లిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మందడంలో రైతులు చేస్తోన్న దీక్షకు ఈ రోజు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా స్థలిలో మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏంటయ్యా? అంటూ జాతీయ స్థాయిలో నవ్వుకుంటున్నారని తెలిపారు.
అమరావతి రాజధాని కోసం శాంతి యుతంగా నిరసన చేస్తోన్న మహిళలపై పోలీసులు దాడులకు పాల్పడడం ఏంటని ఆయన నిలదీశారు. మహిళల దగ్గర బాంబులు లేదా మారణాయుధాలు ఉన్నాయా? దాడి చేయడానికి అని ఆయన ప్రశ్నించారు.
రాజధానిని మూడు ముక్కలు చేసే హక్కు ముఖ్యమంత్రి జగన్‌కు లేదని నారాయణ అన్నారు. 50 వేల ఎకరాల భూమి అమరావతి నడిబొడ్డున ఉందని ఆయన చెప్పారు. పోలీసులు, భద్రతా సిబ్బంది లేకుండా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగగలరా? అని ఆయన ప్రశ్నించారు.