two thousand note: చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 56 శాతం నకిలీలు!
- నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో నివేదిక
- పట్టుబడుతున్న ఫేక్ నోట్లలో అత్యధికం ఇవే
- బెస్ట్ ఫీచర్స్ అని చెప్పినా తప్పని నకిలీల బెడద
దేశంలో చలామణిలో ఉన్న రెండు వేల నోట్లలో 56 శాతం నకిలీలని తేలింది. ఇటీవల జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) అందించిన డేటా ప్రకారం నోట్ల రద్దు అనంతరం మార్కెట్లోకి విడుదలైన నోట్లలో అత్యధికంగా నకిలీలు తయారవుతున్నవి రెండు వేల నోట్లేనని ఈ నివేదిక తేల్చింది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తొలిసారి రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పలు విమర్శలు చెలరేగాయి. నోట్లు మార్చుకునేందుకు జనం నానా పాట్లు పడ్డారు.
నకిలీలను అరికట్టడం, బ్లాక్‌మనీని బయటకు తేవడం లక్ష్యంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు అప్పట్లో బీజేపీ ప్రభుత్వం సమర్థించుకుంది. అనంతరం వెయ్యి నోట్లను పూర్తిగా చలామణి నుంచి తొలగించి దాని స్థానంలో రూ.2 వేలు, రూ.500 నోట్లను మార్కెట్లోకి తెచ్చింది.
భద్రతా పరంగా ఈ నోటు అత్యంత కట్టుదిట్టమైన ఫీచర్లను కలిగి ఉందని, దీనికి నకిలీలు తేవడం అంత ఈజీ కాదని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న నకిలీలలో రూ.2 వేల నోట్లే అధికమని తేలడంతో ఈ నోటు భద్రతా ఫీచర్లు అన్నీ డొల్లేనని తేలిపోయింది.