Andhra Pradesh: పవన్ కల్యాణ్ పై సెటైర్ల వర్షం కురిపించిన అంబటి రాంబాబు
- ఏపీలో బీజేపీ, జనసేన భాగస్వామ్యం
- స్పందించిన అంబటి రాంబాబు
- స్థిరత్వంలేని నాయకుడంటూ విమర్శలు
బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పందించారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యక్తిగత జీవితంలోనే కాకుండా రాజకీయాల్లోనూ స్థిరత్వం లేని ఓ నాయకుడు జనసేన పార్టీని నడుపుతున్నాడంటూ విమర్శించారు.
"సుందరయ్య భవన్ లో కూర్చుని పుస్తకం చదువుతుంటే ఆయనకు తరిమెల నాగిరెడ్డి చాలా గొప్పవాడిగానూ, చేగువేరా మహాయోధుడిగానూ అనిపిస్తారు. కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ మానవాళిని బాగు చేసేదిగానూ అనిపిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూర్చుని పుస్తకాలు చదువుతుంటే ఆయనకు చంద్రబాబు అంతటి మేధావి, పరిపాలనదక్షుడు, లోకేశ్ బాబు అంతటి తెలివిగలవాడు ఇంకెవరూ లేరని అనిపిస్తుంది. అంతేకాదు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదువుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ అంతటి గొప్పవారు ఇంకెవరూ లేరని, అమిత్ షా అంతటి అనుభవజ్ఞుడు ఇంకెవరూ లేరని అనిపిస్తుంది. మరి రేపు ఏ లైబ్రరీలో ఏ పుస్తకం చదువుతుంటే వారికి ఏమనిపిస్తుందో వారికే వదిలేస్తున్నాం.
ఇప్పుడు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతున్నట్టుగా బీజేపీతో కలిశారు. కానీ భేషరతుగా బీజేపీతో కలిశామని చెబుతున్నారు కాబట్టి ఎందుకు ఆ విధంగా కలిశారో చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. నాడు పాచిపోయిన లడ్డూలు అంటూ మోదీపై ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు కిస్మిస్ లు, జీడిపప్పు వేసిన లడ్డూలేమైనా పంపించారా? ఆ లడ్డూలకు ఆశపడి భేషరతుగా ముందుకు వచ్చారా? నాడు మీరు ప్రత్యేక హోదాపై పోరాడుతుంటే ప్రజలు మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడెందుకు ప్రత్యేక హోదాపై మాట్లాడకుండా భేషరతుగా కలిసిపోయారు? పైగా ప్రత్యేకహోదాపై మమ్మల్ని అడగమంటారా? మాకు 23 సీట్లు ఉన్నా ఇవ్వాల్సింది బీజేపీనే కదా! ఇప్పుడు మీతో కలిసి ప్రయాణించాలనుకున్న పార్టీని అడక్కుండా మాపై నెపం నెట్టడం భావ్యం కాదు" అంటూ ఘాటుగా స్పందించారు.