Tihar: తీహార్ జైలు అధికారుల తీరుపై నిర్భయ తల్లి అసంతృప్తి!
- నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్
- ఉరి అమలు తేదీని మార్చాలంటున్న తీహార్ జైలు అధికారులు
- దోషులను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్న ఆశాదేవి
నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్ ల నేపథ్యంలో తాము జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమని తీహార్ జైలు అధికారులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. తేదీ మార్చాలంటూ వారు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో తీహార్ జైలు అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని, వారి నిర్లక్ష్యం కారణంగా తామెందుకు బాధ అనుభవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. డెత్ వారెంట్ తేదీని మార్చకూడదని అన్నారు. ఈ కేసులో దోషులను మరణశిక్ష నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్షమాభిక్ష కోరే హక్కు దోషులకు ఉంటే, దారుణంగా హత్యకు గురైన తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరే హక్కు తమకుందని ఆశాదేవి స్పష్టం చేశారు.