Income Tax: ఐటీ శాఖ నుంచి కోట్లలో జరిమానా నోటీసు.. కాల్ సెంటర్ ఉద్యోగి షాక్
- పంజాబ్ లో ఘటన
- కాల్ సెంటర్ ఉద్యోగికి ఐటీ శాఖ నుంచి నోటీసులు
- పాన్ నెంబర్ పై లావాదేవీలు జరిపారని వెల్లడి
- జరినామా చెల్లించాలని నోటీసులు
ఓ కాల్ సెంటర్ ఉద్యోగి జీతం సాధారణంగా వేలల్లోనే ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఐటీ శాఖ నుంచి జరిమానా కట్టాలంటూ నోటీసులు వస్తే అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అది కూడా రూ.3.49 కోట్లు కట్టాలని నోటీసులు వస్తే అంతకంటే దిగ్భ్రాంతికర విషయం మరొకటి ఉండదు. మధ్యప్రదేశ్ కు చెందిన రవి గుప్తా అనే వ్యక్తి పంజాబ్ లో ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కొన్నిరోజుల క్రితం ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసులు వచ్చాయి. 2011-12 ఏడాదికి గాను పాన్ నెంబర్ పై రూ.1.32 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపారని, అందుకు రూ.3.49 కోట్లు జరిమానా చెల్లించాలన్నది ఆ నోటీసుల సారాంశం.
ఆ నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు తన పాన్ నెంబర్ ఆధారంగా ఇతరులు లావాదేవీలు జరిపినట్టు గుర్తించాడు. ముంబయిలోని ఓ వజ్రాల సంస్థ తన పాన్ నెంబర్ ను అక్రమంగా ఉపయోగించుకుందని తెలుసుకున్నాడు. కొన్ని లావాదేవీలు జరిపి ఆపై ఖాతా తొలగించారని, అసలు వాళ్లెవరో తనకు తెలియదని రవి గుప్తా మొత్తుకుంటున్నాడు. మరి ఆదాయపన్ను అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!